AP Schools Reopening 2026: ‘మన బడి – మన పండుగ’ కార్యక్రమం మార్గదర్శకాలు విడుదల. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలు 2026-27 విద్యా సంవత్సరానికి జూన్ 12, 2026న పునఃప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆహ్లాదకరమైన స్వాగతం పలికేందుకు పాఠశాల విద్యాశాఖ “మన బడి – మన పండుగ” (Mana Badi – Mana Panduga) పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
మన బడి – మన పండుగ లక్ష్యాలు
పాఠశాల మొదటి రోజును విద్యార్థులకు మరపురాని అనుభూతిగా మార్చడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. ముఖ్యంగా 1వ తరగతి, 6వ తరగతి, 9వ తరగతిలో కొత్తగా చేరే విద్యార్థులకు ప్రత్యేక స్వాగతం అందించనున్నారు. అలాగే డ్రాప్‌అవుట్ విద్యార్థులు, ఇతర పాఠశాలల నుండి బదిలీపై వచ్చిన విద్యార్థులను కూడా ఆహ్వానించనున్నారు.
ప్రత్యేక స్వాగతం పొందే విద్యార్థులు
- అంగన్‌వాడి నుండి 1వ తరగతిలో చేరే చిన్నారులు
- 5వ తరగతి నుండి 6వ తరగతికి మారే విద్యార్థులు
- 8వ తరగతి నుండి 9వ తరగతికి చేరే విద్యార్థులు
- డ్రాప్‌అవుట్ విద్యార్థులు
- ప్రైవేట్ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులు
- ఇతర జిల్లాలు లేదా రాష్ట్రాల నుండి బదిలీపై వచ్చిన విద్యార్థులు
పాఠశాలల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లు
పాఠశాలలు ప్రారంభానికి ముందు తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలను శుభ్రపరచాలి. పాఠశాల ప్రవేశ ద్వారాలను మామిడి తోరణాలు, ముగ్గులు, పూలతో అలంకరించాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని పేర్కొన్నారు.
అదనంగా స్వాగత బ్యానర్లు, విద్యార్థుల చిత్రాలు, పూర్వ విద్యార్థుల విజయ గాథలను ప్రదర్శించాలి.
జూన్ 12న నిర్వహించనున్న కార్యక్రమాలు
పాఠశాల గేటు వద్ద ప్రతి విద్యార్థిని పేరుపెట్టి స్వాగతించడం, పుష్పం లేదా స్వాగత సందేశం అందించడం, బడ్డీ బ్యాడ్జ్ ఇవ్వడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ప్రార్థన, పాఠశాల గీతం, ప్రతిజ్ఞ, ప్రధానోపాధ్యాయుల సందేశం ఉంటాయి.
సీనియర్ విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద నృత్యాలు, విద్య విలువపై చిన్న నాటికలు నిర్వహిస్తారు. కొత్తగా చేరిన విద్యార్థులకు పాఠశాల ప్రాంగణాన్ని చూపించే ప్రత్యేక క్యాంపస్ టూర్ కూడా ఏర్పాటు చేయనున్నారు.
విద్యార్థి కిట్ల పంపిణీ
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు మరియు ఇతర విద్యా సామగ్రిని పంపిణీ చేయనున్నారు. తల్లిదండ్రులతో కలిసి “మన బడి” సెల్ఫీ ఫోటోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో పంచుకోవాలని సూచించారు.
ప్రత్యేక మధ్యాహ్న భోజనం
పాఠశాల ప్రారంభ దినోత్సవాన్ని మరింత ప్రత్యేకంగా మార్చేందుకు విద్యార్థులకు స్వీట్ పొంగల్ లేదా స్థానిక ప్రత్యేక వంటకం అందించనున్నారు. అదే సమయంలో తల్లిదండ్రులకు పాఠశాల టైమ్‌టేబుల్, విద్యా క్యాలెండర్ మరియు ఇతర వివరాలను తెలియజేస్తారు.
“మన బడి – మన పండుగ” కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థికి ఆనందకరమైన, సురక్షితమైన మరియు ప్రోత్సాహకరమైన విద్యా వాతావరణాన్ని కల్పించడం ప్రభుత్వ లక్ష్యం. పాఠశాల, తల్లిదండ్రులు, సమాజం కలిసి విద్యార్థుల భవిష్యత్తును నిర్మించాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం అందిస్తోంది. జూన్ 12న రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది.
మన బడి – మన పండుగ 2026 సామూహిక ప్రతిజ్ఞ
మేము – ఈ పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు మరియు సమాజ సభ్యులు – ఈ రోజు ఒక్క మనసుతో ప్రతిజ్ఞ చేస్తున్నాం:
ప్రతి బిడ్డ సురక్షితంగా, సంతోషంగా పాఠశాలకు వచ్చేలా చేయడం మా బాధ్యత.
ఏ బిడ్డ కూడా మానకుండా, చదువు అర్థాంతరంగా ఆగకుండా కాపాడతాం.
పాఠశాలను అందరికీ సమ్మిళిత, వివక్షత లేని స్థలంగా నిలబెడతాం.
విద్యార్థులకు జ్ఞానవంతమైన, ఆనందమయమైన అభ్యాస వాతావరణాన్ని అందిస్తాం.
ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల చదువులో భాగస్వాములు అవుతారు.
ప్రతి ఉపాధ్యాయుడు బాలల్ని గౌరవిస్తూ, ప్రేరణను కల్పిస్తారు.
సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ పాఠశాల పిల్లల సంరక్షకులే.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులైన మేము జ్ఞానంలో, శ్రమలో, నీతిలో దేశాన్ని నిర్మిస్తాం. ఇదే మా ప్రతిజ్ఞ